కరోనా : ఎన్‌పీఎస్‌ చందాదారులకు ఊరట

 న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్  పాజిటివ్  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  నేషనల్ పెన్షన్ సిస్టం లేదా జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)  తన చందాదారులకు ఊరట నిచ్చింది.కరోనా వైరస్  బారిన పడిన తమ చందారులు  చికిత్స ఖర్చుల కోసం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని తెలిపింది.  ఈ మేరకు  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారిని అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తిస్తున్నామని ప్రకటించింది. ప్రాణాంతకమైన వ్యాధి  సోకిన చందాదారులు ఇప్పుడు తమ ఎన్‌పిఎస్ ఖాతాల నుండి నిధులను పాక్షిక ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు తెలిపింది. తమ పథకాలు  సహజంగా సరళమైనవి కాబట్టి, నగుదును యాడ్ చేసుకోవడానికి గడువులు లేనందున, ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షన్ ఖాతాలకు నిధులను జోడించవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ సుప్రతీం బంధ్యోపాధ్యాయ్ తెలిపారు.