శ్రీకాళహస్తి: శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శివోహమ్’ గ్రంథాన్ని మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరునికి బహూకరించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా ‘శివోహామ్’ గ్రంథం స్వామివారికి సమర్పించడం పట్ల శ్రీకాళహస్తి పండిత అధికార బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఆలయ పండితులు ఈ గ్రంథాన్ని రచించిన పురాణపుండ శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. తొలి ప్రతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆర్‌కె రోజా అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధానంలో దివ్య మంగళకరమైన గ్రంథాన్ని ఆవిష్కరించి, భక్తులకు అందజేయడం తన పురాకృత జన్మసుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ గ్రంథాన్ని రచించిన పురాణపుండ శ్రీనివాస్‌ను ఆర్‌కె రోజా ప్రశంసించారు.
శివరాత్రి శుభవేళని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ‘శివోహమ్’ గ్రంధాలను అర్చక, వేదపండిత, భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. రాజకీయాలలోనే కాకుండా భక్తి కార్యక్రమాల్లో కూడా ఎంతో శ్రద్ధగా ఎమ్మెల్యే రోజా పాల్గొనడం తమకు ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఆమెను అభినందించారు. ‘శివోహమ్’ గ్రంథాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, నగరి, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలలో కూడా వేలకొలది భక్తులకు గ్రంథ రచయిత పురాణపుండ శ్రీనివాస్ పంపిణీ చేశారు.